సోనియా గాంధీ రాసిన 544 పేజీల ఆత్మకథ 'బిలాంగింగ్' నవంబర్ 10న పాఠకుల ముందుకు రానుంది. ఇటలీలో తన బాల్యం, రాజీవ్ గాంధీతో పరిచయం, భారత రాజకీయాల్లోకి ప్రవేశం వంటి అనేక అంశాలను ఆమె ఈ పుస్తకంలో పంచుకున్నారు.
1965లో కేంబ్రిడ్జ్‌లో 19 ఏళ్ల విద్యార్థినిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీతో జరిగిన మొదటి భేటీని ఆమె ఇందులో వివరించారు. వివాహం తర్వాత భారత్‌కు వచ్చిన కొత్తలో భారతీయ జీవనశైలికి అలవాటుపడటం, హిందీ నేర్చుకోవడం, చీరలు కట్టడం, భారతీయ ఆహారాన్ని స్వీకరించడం వంటి తొలిరోజుల అనుభవాలను ఆమె వెల్లడించారు.
ఈ పుస్తకంలో ఇందిరా గాంధీతో తన మొదటి భేటీ, గాంధీ కుటుంబంతో గడిపిన జీవితం గురించి ప్రత్యేక అధ్యాయాలు ఉన్నాయి. విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణం, 1984లో ఇందిరా గాంధీ హత్య, ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యే వరకు జరిగిన పరిణామాలను ఆమె వివరంగా రాశారు.
1991లో ఎన్నికల ప్రచారంలో ఆత్మాహుతి దాడి ద్వారా రాజీవ్ గాంధీ హత్యకు గురైన విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. భర్త మరణం తర్వాత రాజకీయాల్లోకి రావాలన్న ఒత్తిడిని చాలా కాలం పాటు ఆమె తిరస్కరించారు.
అయితే, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి అత్యధిక కాలం అధ్యక్షురాలిగా ఎలా పనిచేశారో ఈ పుస్తకంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ తనను ప్రధానమంత్రి పదవికి ఎంపిక చేసినప్పటికీ, ఆ పదవిని తిరస్కరించి సంకీర్ణ ప్రభుత్వాన్ని అంటే వివిధ పార్టీల కలయికతో ఏర్పడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పార్టీని ఎలా నడిపించారో ఆమె వివరించారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశంలో చోటుచేసుకున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక మార్పులను కూడా ఈ పుస్తకం చర్చిస్తుంది. గాంధీ కుటుంబం గురించి భారతీయులకు తెలియని ఎన్నో విషయాలను సోనియా గాంధీ ఈ ఆత్మకథ ద్వారా వెల్లడించారు.








