నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తికాగానే, ‘ఓజీ’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటించేందుకు నాని సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సేను తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోంది. ఇప్పటికే దర్శకుడు సుజీత్, నిర్మాతలు ఆమెతో చర్చలు జరిపారు. కథ, తన పాత్ర నచ్చడంతో భాగ్యశ్రీ ఈ సినిమాకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

రవితేజ సరసన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన భాగ్యశ్రీ బోర్సే, ఆ తర్వాత ‘కింగ్డమ్’, ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా అఖిల్ హీరోగా వచ్చిన ‘లెనిన్’ సినిమాతో ఆమెకు మంచి క్రేజ్ లభించింది. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నాని వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉండటం, సుజీత్ దర్శకత్వంలో సినిమా వస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. నాని–భాగ్యశ్రీ జోడీ వెండితెరపై ఎలా ఉండబోతుందో చూడాలి.