నల్లగొండలో విద్యుత్ కోతలు, లో-వోల్టేజీ సమస్యలతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ నిరసనను తెలియజేసేందుకు కాలిపోయిన మోటార్లను, ఎండిన వరి పంటను తీసుకువచ్చి నల్లగొండలోని ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయం ముందు ఉంచారు.

నకిరేకల్ నియోజకవర్గ రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యాలయ ప్రధాన గేటుకు అడ్డంగా బైఠాయించారు. విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని, రోజుకు కనీసం 10 గంటల కరెంటు కూడా అందడం లేదని రైతులు ఆరోపించారు. ఓవర్ లోడ్‌తో విద్యుత్ సరఫరా ట్రిప్ అవ్వడం వల్ల మోటార్లు పనిచేయడం లేదని వారు వాపోయారు.

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సరఫరా వివరాలను నమోదు చేసే సబ్‌స్టేషన్ లాగ్‌బుక్స్‌ను అధికారులు నిలిపివేశారని ఆయన ఆరోపించారు. ఎంత కరెంటు సరఫరా అవుతుందో బయటపడుతుందనే భయంతోనే ఇలా చేస్తున్నారని ఆయన విమర్శించారు.

ప్రభుత్వం రైతు భరోసా, రైతు బీమా పథకాలను సరిగ్గా అమలు చేయడం లేదని చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. ఎరువుల కోసం రైతులు పడిగాపులు పడాల్సి వస్తోందని, ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరుతో దోపిడీ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. తక్షణమే విద్యుత్ సమస్యలను పరిష్కరించకపోతే కలెక్టరేట్ ముట్టడికి కూడా వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు.

రెండు గంటల పాటు కొనసాగిన ఈ ఆందోళన తర్వాత, ట్రాన్స్‌కో ఎస్‌ఈ రైతుల వద్దకు వచ్చి వినతిపత్రాన్ని స్వీకరించారు. నిరంతర విద్యుత్ సరఫరాపై హామీ లభించే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు నినదించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.