నల్లగొండ మండలం కొత్తపల్లి గ్రామంలో జిల్లా వ్యవసాయాధికారి ఉల్లోజు వినోద్‌కుమార్‌ శనివారం పర్యటించారు. వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీనివాస్‌తో కలిసి వరి, పత్తి పంటలను పరిశీలించిన ఆయన, డిజిటల్ పంటల సర్వే పురోగతిని సమీక్షించారు.

ప్రభుత్వం ప్రకటించిన ఏడు రకాల సన్న వరి రకాలను సాగు చేసే రైతులకు క్వింటాలుకు రూ. 500 బోనస్ అందుతుంది. ఈ బోనస్ పొందాలంటే, సర్వే సమయంలో రైతులు తాము సాగు చేస్తున్న వరి రకాన్ని తప్పులు లేకుండా నమోదు చేయించుకోవాలని వినోద్‌కుమార్‌ స్పష్టం చేశారు.

సర్వే నిర్వహించే సమయంలో రైతులు తమ పొలాల వద్ద అందుబాటులో ఉండాలని అధికారులు కోరారు. పంట రకం, సాగు వివరాలను కచ్చితంగా నమోదు చేయడం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వం అందించే ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.

పంటల నమోదులో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సర్వే సిబ్బందిని వినోద్‌కుమార్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు, సర్వే సిబ్బందితో పాటు స్థానిక రైతులు పాల్గొన్నారు.