దివ్యా భాటియా, అన్షు భాటియా అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇస్లాం మతంలోకి మారి, తమ పేర్లను జోయా దియా భాటియా, అమీనా అన్షు భాటియాగా మార్చుకున్నారు. ముస్లిం యువకులను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న వీరిని, వారి తండ్రి ఇంట్లో బంధించి అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో, తమ కుమార్తెలను తండ్రి బలవంతంగా నిర్బంధించారని ఆరోపిస్తూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై జస్టిస్ సందీప్ జైన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

వయోజన మహిళలు తమకు నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు, నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛ, నివాసాన్ని ఎంచుకునే అధికారం కలిగి ఉంటారని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ పోలీసుల సహకారంతో తండ్రి వారిని బంధించి ఉంటే, అది చట్టపరమైన నేరమని కోర్టు హెచ్చరించింది. అక్రమ నిర్బంధం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది.

ఈ కేసులో తండ్రికి సూచనలు చేసిన కోర్టు, ఆ ఇద్దరు యువతులను స్వేచ్ఛగా వదిలిపెట్టాలని ఆదేశించింది. యువతుల భవిష్యత్తును నిర్ణయించుకునే పూర్తి హక్కు వారికే ఉంటుందని కోర్టు పేర్కొంది. ఈ కేసులో భాగంగా, ఆగస్టు 6లోగా దివ్యా మరియు అన్షులను కోర్టులో హాజరుపర్చాలని స్థానిక పోలీసులను ధర్మాసనం ఆదేశించింది.