రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో నీట్ రీఎగ్జామ్‌కు ముందు శనివారం కొందరు విద్యార్థులకు వీడియో కాల్స్ వచ్చాయి. ఆ కాల్స్‌లో ప్రశ్నపత్రం లీకైనట్లు చూపించి, దాన్ని పొందాలంటే రూ.30,000 చెల్లించాలని కోరారు. డబ్బును క్యూఆర్ కోడ్ ద్వారా జమ చేయాలని ఆ వ్యక్తులు సూచించారు.
ఈ విషయాన్ని గమనించిన అజ్మీర్‌లోని డీఏవీ కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడు కృష్ణ సింగ్ ఠాకూర్, కాల్ చేసిన మహిళతో మాట్లాడి ఆ సంభాషణను రికార్డ్ చేశారు. తర్వాత ఆయన పోలీసులను ఆశ్రయించి, కాల్ చేసిన నంబర్, క్యూఆర్ కోడ్ వంటి డిజిటల్ ఆధారాలను అందజేశారు. ఇలాంటి మోసాలకు చాలా మంది విద్యార్థులు గురయ్యారని, వెంటనే దర్యాప్తు జరపాలని కోరారు.
ఫిర్యాదు మేరకు అజ్మీర్ పోలీసులు విచారణ ప్రారంభించారు. క్యూఆర్ కోడ్‌కు సంబంధించిన మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అజ్మీర్ ఎస్పీ ఉషా యాదవ్ మాట్లాడుతూ, కాల్‌లో చూపించిన ప్రశ్నపత్రం నిజమేనా అని నిర్ధారించుకుంటున్నట్లు తెలిపారు.
ఇది నిజంగా పేపర్ లీక్ రాకెట్ పనియా, లేక విద్యార్థులను మోసం చేయడానికి పన్నిన కొత్త వ్యూహమా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఇలాంటి మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకోవద్దని అభ్యర్థులను అధికారులు హెచ్చరించారు.








