అమెరికాలో F-1 వీసాపై చదువుతున్న విదేశీ విద్యార్థులకు ఇప్పటివరకు ఉన్న 'డ్యురేషన్ ఆఫ్ స్టేటస్' సౌలభ్యాన్ని తొలగించాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత విధానం ప్రకారం కోర్సు పూర్తయ్యే వరకు విద్యార్థులు ప్రత్యేకంగా వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే, విద్యార్థులకు నాలుగు సంవత్సరాల వరకు మాత్రమే ప్రవేశ అనుమతి ఇస్తారు.

ఈ గడువు ముగిసిన తర్వాత అమెరికాలో కొనసాగాలంటే, విద్యార్థులు తప్పనిసరిగా యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ద్వారా పొడిగింపు కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఈ మార్పును ప్రతిపాదించింది. ప్రస్తుత విధానంలో కొందరు వీసా గడువు దాటినా దేశంలోనే ఉండిపోతున్నారని, వారిని గుర్తించడం కష్టమవుతోందని అధికారులు ఈ నిర్ణయానికి కారణం చెబుతున్నారు.

ఈ నిర్ణయంపై విద్యా రంగం, ఇమ్మిగ్రేషన్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరచూ పొడిగింపుల కోసం దరఖాస్తులు చేయాల్సి రావడంతో పేపర్‌వర్క్ పెరిగి, చదువులో అంతరాయం కలగే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పీహెచ్‌డీ, రీసెర్చ్ కోర్సులు చేసే భారతీయ విద్యార్థులకు ఇది ఎక్కువ ఇబ్బందికరంగా మారనుంది. వీరు ఐదు నుంచి ఏడేళ్లు అమెరికాలో ఉండాల్సి వస్తుండగా, కొత్త నిబంధనల ప్రకారం మధ్యలో తప్పనిసరిగా పొడిగింపులు తీసుకోవాల్సి వస్తుంది.

అదనంగా చదువు పూర్తైన తర్వాత ఉద్యోగాలు వెతక్కోవడానికి ఇస్తున్న గ్రేస్ పీరియడ్‌ను 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించే ప్రతిపాదన కూడా ఉంది. ఇది అమల్లోకి వస్తే, విద్యార్థులు ఉద్యోగాలు వెతకడానికి సమయం సరిపోక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.