స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరనున్న నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మహ్మద్ పెజెష్కియాన్ కీలక వివరణ ఇచ్చారు. ఈ ఒప్పందం ద్వారా ఖతార్‌లో స్తంభింపబడిన 6 బిలియన్ డాలర్ల ఇరాన్ నిధులను అమెరికా తిరిగి ఇవ్వనుందని ఆయన వెల్లడించారు. అమెరికా కోరిక మేరకు తమ దేశం వద్ద అణు బాంబు ఉండకూడదని, తాము అణు బాంబు తయారు చేయబోమని పెజెష్కియాన్ స్పష్టం చేశారు.

ఈ చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన బృందంతో కలిసి ఇటీవల స్విట్జర్లాండ్ చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, సలహాదారు జారెడ్ కుష్నర్ ఇప్పటికే అక్కడ ఉన్నారు. ఇరాన్ తరఫున స్పీకర్ మొహ్మమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అఘర్చీ, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ సెక్రటరీ అలీ బఘేరీ కనీ, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అబ్దుల్నాసర్ హెమ్మతి చర్చలకు హాజరయ్యారు.

పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరియు ఖతార్ ప్రతినిధులు మధ్యవర్తులుగా ఈ సమావేశాలకు హాజరయ్యారు. అవగాహన ఒప్పందం (ఎంఓయూ)లోని నిబంధనలన్నీ ఇరాన్‌కు అనుకూలంగా ఉన్నాయని పెజెష్కియాన్ పేర్కొన్నారు. ఈ పరిణామాలపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తీవ్ర అసంతృప్తితో ఉంటారని ఆయన ఎగతాళి చేశారు.

చర్చలు సానుకూల దిశలో సాగుతున్నాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఆదివారం ఉదయం జ్యూరిచ్ చేరుకున్న వాన్స్, ఇరాన్ ప్రతినిధి బృందానికి స్పీకర్ ఘాలిబాఫ్ నాయకత్వం వహిస్తున్నట్లు గమనించారు. ఈ భేటీలో ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించుకునే దిశగా చర్చలు జరుగుతున్నాయి.