ఆదివారం మధ్యాహ్నం 1.15 గంటలకు న్యూఢిల్లీ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, వెంటనే అధికారిక నివాసానికి వెళ్లకుండా ఎయిర్‌పోర్టులోనే 45 నిమిషాలపాటు ఉండిపోయారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగిన యోగా డే కార్యక్రమంలో పాల్గొని తిరిగి వచ్చిన ఆయన, మధ్యాహ్నం 2.00 గంటల తర్వాతే అక్కడి నుంచి బయల్దేరారు.

ప్రధాని ప్రయాణానికి సాధారణంగా ట్రాఫిక్ క్లియర్ చేస్తారు కాబట్టి, ఆ సమయంలో రోడ్లపై వాహనాల రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఆదివారం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఢిల్లీలోని పలు కేంద్రాల్లో నీట్ యూజీ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ - అండర్ గ్రాడ్యుయేట్) పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను లోపలికి అనుమతించరు.

తను వెంటనే బయటకు వస్తే, సెక్యూరిటీ మరియు ట్రాఫిక్ నియంత్రణ చర్యల వల్ల పరీక్షకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బంది కలగవచ్చని ప్రధాని భావించారు. దీంతో పరీక్ష ప్రారంభమయ్యే 2.00 గంటల వరకు ఎయిర్‌పోర్టులోనే వేచి ఉండి, తర్వాత తన నివాసానికి వెళ్లడం ద్వారా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు.

విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు సానుకూలంగా భావిస్తున్నారు. కాగా, కొద్దిసేపటి క్రితమే ఈ నీట్ పరీక్ష ముగిసింది.