అంతర్జాతీయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. మెలోనీ తన ఫోటో దిగేందుకు బ్రతిమిలాడిందని, ఇటలీలో ఆమె ప్రజాదరణ క్షీణించిందని ట్రంప్ ఆరోపించగా, దీనికి మెలోనీ ఘాటుగా స్పందించి తన ప్రజాదరణ గురించి ఆయన ఆలోచించవద్దని హితవు పలికారు. విదేశీ నేత తమ దేశాన్ని అవమానించడాన్ని ఇటలీ ప్రతిపక్షాలు సహించలేదు.
ఇటలీలో ప్రధాన ప్రతిపక్షమైన డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు ఎల్లి ష్లైన్ పార్లమెంట్‌లో మాట్లాడుతూ, మేము రాజకీయ ప్రత్యర్థులమే కానీ ముందుగా ఇటలీ పౌరులమని, విదేశీ నేత బెదిరింపులు సహించబోమని స్పష్టం చేశారు. అలాగే మాజీ ప్రధాని, ఫైవ్ స్టార్ మూవ్‌మెంట్ పార్టీ అధినేత గైసెప్పే కాంటే కూడా ట్రంప్ వ్యాఖ్యలు చులకనగా ఉన్నాయని మండిపడ్డారు. విదేశీ నేత దాడి చేస్తే ప్రతిపక్షాలు ఏకమై నిలబడటం ఇటలీలో కనిపించింది.
కానీ భారత్‌లో మాత్రం విదేశీ నేతలు భారత ప్రధానిపై లేదా దేశంపై విమర్శలు చేస్తే ప్రతిపక్షాలు వారికి మద్దతుగా నిలుస్తున్నాయి. ఉదాహరణకు ఆపరేషన్ సిందూర్ సమయంలో ట్రంప్ భారత విమానాలు కూలిపోయాయని, తానే యుద్ధం ఆపానని చెప్పినప్పుడు రాహుల్ గాంధీ ఆ మాటలను అందుకుని మన యుద్ధ విమానాలు ఎన్ని కూలాయని ప్రశ్నించారు. ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థను 'డెడ్ ఎకానమీ' (చచ్చిన ఆర్థిక వ్యవస్థ) అని విమర్శించినప్పుడు కూడా రాహుల్ గాంధీ అది నిజమేనని వ్యాఖ్యానించారు.
ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వంటి సంస్థలు భారత్ వృద్ధిరేటు ప్రపంచంలోనే మెరుగ్గా ఉందని చెబుతుంటే, మన ప్రతిపక్ష నేతలు దేశ ప్రతిష్టను దిగజార్చే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్, ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ వంటి వారు ట్రంప్ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవడం లేదు. యూరప్ దేశాలు ట్రంప్‌ను జమకట్టకపోయినా, భారత ప్రతిపక్షాలు మాత్రం ఆయన మాటలకు స్పందిస్తున్నాయి.
అధికార పక్షం తప్పులను ఎత్తి చూపడం ప్రతిపక్షాల బాధ్యతే కానీ, ట్రంప్ వంటి వ్యక్తి వ్యాఖ్యలకు వంత పాడటం దేశానికి మంచిది కాదు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఎలా ఉండాలో ఇటలీ నాయకుల తీరును చూసి రాహుల్ గాంధీతో సహా భారత ప్రతిపక్షాలు నేర్చుకోవాలని ప్రజలు సూచిస్తున్నారు.








