గంభీరావుపేట, ఆగస్టు 25 (ఆంధ్రప్రభ): పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. అటవీ శాఖ ఆద్వర్యంలో గంభీరావుపేట మండలం గోరంటాల బీట్ పరిధిలోని గజ సింగవరం శివారులో మంగళవారం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై మొక్కలు నాటి ప్రారంభించారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. అడవులను అందరూ సంరక్షించాలని పిలుపు నిచ్చారు. దీంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమని తెలిపారు. అడవులతోనే వర్షాలు కురుస్తాయని వివరించారు. అటవీ విస్తీర్ణం తగ్గడంతో వన్యప్రాణులు, పక్షుల మనుగడకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వన్యప్రాణులు ఇండ్లలోకి వస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు.
ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని వివరించారు. జిల్లా మొత్తం లక్ష్యం 8,65,200 కాగా, 6,89, 212 మొక్కలు నాటి.. 79.66 శాతం లక్ష్యం పూర్తి చేశామని వెల్లడించారు. వన మహోత్సవంలో భాగంగా రెండు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో ప్రతి ఇంటికి మూడు నుంచి ఐదు మొక్కలు పంపిణీ చేస్తామని, అందరూ నాటి సంరక్షించాలని పిలుపు నిచ్చారు. మునగ మొక్కలు నాటాలని, దీంతో ఆరోగ్య పరంగా ఎన్నో లాభాలు ఉన్నాయని వివరించారు.
ప్రతి ఇంటికి ఇచ్చిన తడి, పొడి చెత్త బుట్టలను సద్వినియోగం చేసుకోవాలని, ఇంటి నుంచే చెత్తను వేరు చేసి ఇవ్వాలని సూచించారు. ప్లాస్టిక్ కవర్లు వాడటంతో పర్యావరణ ఇబ్బందులు వస్తున్నాయని, అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. మార్కెట్, షాపుకి వెళ్లినప్పుడు బట్ట సంచితో వెళ్లాలని తెలిపారు. ప్రతి ఇంట్లో, అన్ని ఫంక్షన్లలో స్టీల్ ప్లేట్లు, గ్లాసులు వాడాలని పిలుపు నిచ్చారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కొమురిశెట్టి విజయ, సర్పంచ్ లతిక, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, మిషన్ భగీరథ ఈఈలు అన్వర్, సుమలత, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, ఎంపీడీఓ రాజేందర్ లు పాల్గొన్నారు.








