నిర్మల్ ప్రతినిధి, ఆగస్టు 25 (ఆంధ్రప్రభ) : మంగళవారం సారంగాపూర్ మండలంలోని ఆడెల్లి పోచమ్మ హరితవనంలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా భారీ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, చీఫ్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ బాసర సర్కిల్ అపర్ణ, డిఎఫ్ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడే లతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం వల్ల పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుందని అన్నారు. మనమంతా ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవనం కొనసాగించాలంటే తప్పనిసరిగా మొక్కలు నాటాలని అన్నారు. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, మొక్కలను సంరక్షించడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు.
మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని చెప్పారు. మొక్కలు నాటడం వల్ల పచ్చదనం పెంపొందించడమే కాకుండా, ప్రకృతితో బంధాన్ని పెంచుకోవడానికి దోహదపడుతుందని తెలిపారు. మొక్కలు నాటడానికి కేవలం ఒక కార్యక్రమంలా కాకుండా ఒక యజ్ఞంలా చేపట్టి భావితరాలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించాలన్నారు.
ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలి: జిల్లా ఎస్పీ జానకి షర్మిలఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు చిన్ననాటి నుండే పర్యావరణ పరిరక్షణ బాధ్యతను తీసుకోవాలన్నారు. మనం నాటిన మొక్కలు తరతరాలకు ఉపయోగకరంగా ఉంటాయని వివరించారు. విరివిగా మొక్కలు నాటడం వల్ల కాలుష్యాన్ని కూడా తగ్గించిన వారమవుతామని తెలిపారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడితేనే మానవాళికి మనుగడ ఉంటుందని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కంకణ బదులు కావాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు మహిళా సంఘాలు భాగస్వామ్యం కావాలని చెప్పారు.
అటవీ విస్తీర్ణ లక్ష్యం పెంచేందుకు ప్రతి ఒక్కరు సహకారం అందివ్వాలి:చీఫ్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ బాసర సర్కిల్ అపర్ణ అటవీ విస్తీర్ణం పెంచేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని సిసిఎఫ్ బాసర సర్కిల్ అపర్ణ తెలిపారు. భౌగోళికంగా అటవీ ప్రాంతం 33 శాతం ఉండాలని, అప్పుడే పర్యావరణ సమతుల్యత ఉంటుందని అన్నారు. జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి, వాటిని రక్షించాలని కోరారు. పిల్లల పుట్టినరోజులు, వివాహ దినోత్సవాలు, తదితర శుభకార్యాల సందర్భంగా అతిధులకు మొక్కలు బహుమతులుగా ఇవ్వాలన్నారు.
జిల్లాలో ఇప్పటికే వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతుందని తెలిపారు. సింగిల్ యూసేజి ప్లాస్టిక్ ను వాడకుండా ఉండి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలని వివరించారు. కళాజాత బృందాలు పర్యావరణ పరిరక్షణ, చెట్లు పెంచడం వల్ల కలిగే లాభాలను సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా వివరించారు. అనంతరం అధికారులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు కలిసి భారీగా మొక్కలను నాటారు.ఈ వనమహోత్సవం కార్యక్రమంలో డిఆర్డిఓ విజయలక్ష్మి, డీఎస్పీ శ్రీనివాస్, ఎంపీడీవో లక్ష్మీకాంతరావు, ఎంపీఓ అజీజ్ ఖాన్, సర్పంచ్ లు కూనేరు భూమన్న, దండు సాయన్న, స్థానిక ప్రజలు, విద్యార్థులు, అటవీ శాఖ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.








