మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ త్వరలో కొత్త చిత్రంలో కనిపించనున్నారు. దర్శకుడు అనూప్ సత్యన్‌తో కలిసి తాను సినిమా చేస్తున్నట్లు మోహన్‌లాల్ సోషల్‌మీడియాలో ప్రకటించారు. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ నిర్మాతలు బిను జార్జ్ అలెగ్జాండర్, ఆంటోని పెరుంబవూర్‌లతో కలిసి ఉన్న ఫొటోలను ఆయన పంచుకున్నారు.
ఈ సినిమా నవంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. తన తండ్రి సత్యన్ ఆంథికాడ్ సినిమాల శైలికి ఇది పూర్తి భిన్నంగా ఉంటుందని దర్శకుడు అనూప్ తెలిపారు. యాక్షన్, కామెడీ, థ్రిల్లర్ మరియు భావోద్వేగాల కలయికతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
గత వారమే మోహన్‌లాల్‌కు కథ వినిపించగా, ఆయనకు నచ్చడంతో సినిమా పనులు మొదలుపెట్టారు. అయితే, ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం వారి ఎంపికపై చర్చలు జరుగుతున్నాయని దర్శకుడు పేర్కొన్నారు.








