జైపూర్‌లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2026 అందాల పోటీల ఫైనల్స్‌లో కేరళకు చెందిన కజియా లిజ్ మెజో విజేతగా నిలిచింది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటి, మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అయితే, సుస్మితా విజేత కజియాను కాదని, ఫస్ట్ రన్నరప్ వైష్ణవి గణేష్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఆగస్టు 24న 'మెజెస్టిక్ మూమెంట్స్' అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసిన వీడియో ఈ వివాదానికి కారణమైంది. ఆ వీడియోలో సుస్మితా విజేత కజియాను అభినందించినట్లు కనిపిస్తున్నా, వెంటనే వైష్ణవి వైపు నడుస్తూ ఆమెను ఓదారుస్తూ కనిపించారు. అంతేకాదు, వైష్ణవి తలపై ఉన్న కిరీటాన్ని సుస్మితా సరిచేయడం నెటిజన్లను ఆగ్రహానికి గురిచేసింది.

విజేత కజియాను దాటి సుస్మితా వెళ్లడంపై నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వేదికపై ఉన్న మర్యాదను పాటించలేదని, ఒక మాజీ మిస్ యూనివర్స్‌గా ఆమె ప్రవర్తన సరిగా లేదని విమర్శిస్తున్నారు. సుస్మితా వంటి వారు న్యాయనిర్ణేతలుగా ఉండకూడదని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు, ఇదే వేదికపై ఉన్న మరో న్యాయనిర్ణేత ఊర్వశి రౌతేలా తన దుస్తులతో అందరి దృష్టిని ఆకర్షించారు. భారత జాతీయ జెండాలోని కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల స్ఫూర్తితో రూపొందించిన గౌన్‌ను ఆమె ధరించారు. అంతర్జాతీయ డిజైనర్ 'దాషా' దీనిని రూపొందించారని, దీని కోసం మూడు నెలల సమయం పట్టిందని ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమంలో సుస్మితా సేన్, ఊర్వశి రౌతేలాతో పాటు మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింఘా, పర్యావరణవేత్త ప్రజ్ఞా కపూర్, సెలీనా జైట్లీ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఊర్వశి రౌతేలా తాను న్యాయనిర్ణేతగా వ్యవహరించడం ఇది నాలుగోసారి అని పేర్కొన్నారు. నెటిజన్ల విమర్శలపై సుస్మితా సేన్ ఇప్పటివరకు ఎటువంటి స్పందన తెలపలేదు.