అమెరికా ప్రభుత్వం కెనడా దిగుమతులపై 50 శాతం టారిఫ్ విధించింది. వాణిజ్య ఒప్పంద నిబంధనలను ఖరారు చేయడానికి కెనడా నిరాకరించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ — అంటే అమెరికా తరపున వాణిజ్య ఒప్పందాలను చూసే ప్రతినిధి — జేమిసన్ గ్రీర్ వెల్లడించారు. ఉక్కు, అల్యూమినియం రంగాల్లో సుంకాలు తగ్గించేందుకు అమెరికా సిద్ధపడినా, కెనడా వెనక్కి తగ్గిందని ఆయన పేర్కొన్నారు.
ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా స్పందించారు. కెనడా అతిగా డిమాండ్ చేస్తోందని ఆరోపించిన ఆయన, కెనడా అమెరికాలో ఒక రాష్ట్రంగా చేరడానికి ఇష్టపడటం లేదని, కానీ అమెరికా రాష్ట్రాలకు ఉండే ప్రయోజనాలన్నీ ఆశిస్తోందని విమర్శించారు. అంతేకాకుండా, అమెరికా రైతులపై కెనడా ఏళ్లుగా భారీగా సుంకాలు విధిస్తోందని, ఇకపై అది కుదరదని ఆయన హెచ్చరించారు.
అమెరికా చర్యలను కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీవ్రంగా వ్యతిరేకించారు. అమెరికా విధించిన టారిఫ్‌లను కెనడాపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. చివరి నిమిషంలో నిబంధనలు మార్చడం అన్యాయమని, ఇవి ఆర్థికంగా ఆచరణ సాధ్యం కావని ఆయన తిప్పికొట్టారు. ఈ నిర్ణయాల వల్ల ఏ ఒప్పందంపైనైనా నమ్మకం సడలిపోతోందని ఆయన ఆరోపించారు.
దీంతో కెనడా కూడా ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోంది. అమెరికా విధించిన 50 శాతం సుంకాలకు ప్రతిగా, తాము కూడా డాలర్‌కు డాలర్ పద్ధతిలో దీటుగా స్పందిస్తామని మార్క్ కార్నీ ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థను, జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో కెనడా తన చర్చల బృందాన్ని వెనక్కి పిలిపించింది. ఎన్నికలకు ముందు చోటుచేసుకున్న ఈ పరిణామాలు, రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత సంక్షోభంలోకి నెట్టాయి.








