ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మరియపురం శివారులోని ఎస్ఎస్ గార్డెన్స్‌లో జరిగిన సురేఖ జన్మదిన వేడుకల్లో సుస్మితా పటేల్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సంస్కృతి లేదని, టీడీపీ నుంచి వచ్చిన వారిపైనే ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తోందని, అసలైన కాంగ్రెస్ నాయకులకు స్థానం లేకుండా చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో, మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయించింది. సురేఖ పదే పదే తప్పులు చేస్తున్నారని, గతంలో కూడా కీలక వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కమిటీ తన నివేదికలో పేర్కొంది. తన కుటుంబ సభ్యులను ఆమె నియంత్రించలేకపోతున్నారని, సురేఖపై చర్యలు తీసుకోకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని కమిటీ అభిప్రాయపడింది.

ఈ నివేదికలోని అంశాలను వివరించేందుకు క్రమశిక్షణ కమిటీ సభ్యుడు మల్లురవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవనున్నారు. ఈ అంశంపై ఇప్పటికే స్పందించిన సీఎం, ఇది పార్టీ అంతర్గత వ్యవహారమని, క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉందని తెలిపారు. పార్టీ తీసుకునే నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు, తన కుమార్తె చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. సుస్మితా పటేల్ తన వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకున్నారని, దానికి తనను బాధ్యురాలిని చేయడం సమంజసం కాదని ఆమె పేర్కొన్నారు. తనకు కాంగ్రెస్ క్రమశిక్షణ నియమావళిపై గౌరవం ఉందని చెబుతూ, పీసీసీ క్రమశిక్షణ కమిటీ తనకు జారీ చేసిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని ఆమె కోరారు.

అయితే, సురేఖ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకుండానే కమిటీ చర్యలకు సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ త్వరలోనే ప్రెస్‌మీట్ నిర్వహించి తదుపరి నిర్ణయాలను వెల్లడించనుంది. పార్టీ అధిష్టానం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.