మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ కుటుంబం నుంచి తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన కోడలు మేఘన ఆరోపించారు. ఈ విషయమై ఆమె ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడిన మేఘన, తనను కూతురిలా చూసుకుంటే తాను ఇక్కడ ఎందుకు ఉంటానని ప్రశ్నించారు.

పెళ్లికి ముందే తన భర్తకు ఉన్న సమస్య గురించి జోగి రమేశ్, ఆయన భార్యకు తెలుసని మేఘన పేర్కొన్నారు. ఆ విషయాన్ని దాచిపెట్టి తనను బలిపశువును చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లయిన కొన్ని రోజులకే ఈ ఇబ్బందుల గురించి అత్తమామలకు చెప్పినా, వారు తనకు న్యాయం చేయకపోగా ఇబ్బందులకు గురిచేశారని ఆమె ఆరోపించారు.

జోగి రమేశ్ కుటుంబం నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల గురించి చెప్పుకునేందుకే తాను టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ను కలిశానని మేఘన తెలిపారు. జోగి రమేశ్ తనకు న్యాయం చేసి ఉంటే, తాను ఎమ్మెల్యే వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదని ఆమె చెప్పారు. పెళ్లి జరిగిన రెండు నెలలకే తన భర్త రాజీవ్ విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు (డైవర్స్ ఫైల్) చేశారని, ఆ విషయం తనకు ఇటీవల తెలిసిందని ఆమె వెల్లడించారు.

జోగి రమేశ్‌కు తెలియకుండా విడాకుల ప్రక్రియ జరగదని, అప్పటి నుంచే తనను వదిలించుకోవాలని ఆ కుటుంబం ప్లాన్ చేసిందని మేఘన అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఇబ్బందులపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా ఫిర్యాదు చేశానని ఆమె చెప్పారు. ఆ తర్వాత కూడా ఇబ్బందులు తగ్గకపోవడంతో, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు ఆయన కార్యాలయానికి వెళ్లినా, జగన్‌ను కలుసుకోలేకపోయానని ఆమె వివరించారు.