కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి మారిన మాజీ మంత్రి శైలజానాథ్‌కు శింగనమల నియోజకవర్గంలో అంతర్గతంగా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పార్టీ అధిష్ఠానం ఆయనను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించినా, స్థానిక కీలక నాయకులు మాత్రం ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధపడటం లేదు. బయటకు మాత్రం పరిస్థితులు సహజంగా కనిపిస్తున్నా, లోపల మాత్రం నేతల మధ్య అంతరం పెరిగిపోయింది.
శైలజానాథ్ రాకముందు ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త సాంబశివారెడ్డి పూర్తి ఆధిపత్యం చెలాయించేవారు. వైసీపీ ఆవిర్భావం నుంచీ ఆయన నియోజకవర్గంపై పట్టు సాధించారు. గత ఎన్నికల్లో సామాజిక సమీకరణాల కారణంగా పద్మావతికి టికెట్ రాకపోయినా, సాంబశివారెడ్డి చెప్పిన అభ్యర్థికే అవకాశం ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారు. దీంతో ఆయన వర్గీయులు ఇప్పటికీ పార్టీలో కీలక స్థానాల్లో ఉంటూ, సాంబశివారెడ్డికి దగ్గరగా ఉన్నారు.
ప్రస్తుతం నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఇప్పటికే బలమైన ఇన్‌చార్జ్‌లు, నాయకులు ఉండటంతో శైలజానాథ్ వారందరినీ కలుపుకుని పోలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొందరు నాయకులు మాత్రం తాము ఆయన నాయకత్వంలో పనిచేయలేమని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. సాంబశివారెడ్డి ముఖ్యమంత్రి జగన్‌కు దగ్గరగా ఉంటూ కీలక వ్యవహారాలు చూస్తున్న నేపథ్యంలో, ఆయన వర్గం శైలజానాథ్‌తో కలిసి పనిచేయడానికి సుముఖంగా లేదు.
శైలజానాథ్ బయటి వ్యవహారాల్లో దూకుడుగా ఉన్నా, పార్టీలో కీలకంగా ఉన్న మండల నాయకులతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారని సమాచారం. ఈ విషయాన్ని ఒకరిద్దరు కీలక నాయకులు నేరుగా పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ అంతర్గత విభేదాలను సర్దుబాటు చేసే ప్రయత్నాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.







