ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో భారత్ 259 పరుగుల లక్ష్య ఛేదనలో కష్టాల్లో పడింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ త్వరగా ఔట్ కావడంతో స్టేడియంలోని అభిమానులు ఆందోళన చెందారు. ఈ సమయంలో బ్రాడ్‌కాస్టర్ కెమెరా విఐపీ స్టాండ్స్ వైపు తిరగగా, అక్కడ కూర్చున్న మహేంద్ర సింగ్ ధోనీ చేసిన పని అందరినీ ఆకట్టుకుంది.

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా, 45 ఏళ్ల ధోనీపై అభిమానుల క్రేజ్ తగ్గలేదని ఈ దృశ్యం నిరూపించింది. భారత్ ఇన్నింగ్స్ జరుగుతుండగా, ధోనీ చాలా సాధారణంగా స్టాండ్స్‌లో కూర్చుని చిప్స్ తింటూ మ్యాచ్ చూస్తున్నారు. ఆయన పక్కనే ఒక చిన్నారి కూర్చుని ఉండగా, ధోనీ తన వద్ద ఉన్న చిప్స్ ప్యాకెట్‌ను ఆ పాపకు ఆఫర్ చేశారు.

ఎటువంటి బేషజాలు లేకుండా ధోనీ చిప్స్ ఇవ్వడం, ఆ చిన్నారి నవ్వుతూ వాటిని స్వీకరించడం చూసి ప్రేక్షకులు మురిసిపోయారు. అనంతరం ఇద్దరూ కలిసి మ్యాచ్ చూస్తూ కాసేపు మాట్లాడుకున్నారు. ఈ మధురమైన క్షణాన్ని స్టార్ స్పోర్ట్స్ కెమెరాలో బంధించింది.

స్టార్ స్పోర్ట్స్ ఆ క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, అది నిమిషాల్లో వైరల్ అయింది. ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ వీడియో తెగ ట్రెండ్ అవుతోంది. మైదానంలో ఉన్న స్టార్ల కంటే, ధోనీ సింప్లిసిటీ ముందు ఎవరూ సాటిరాలేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.