మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీసులు సాగర్ చౌదరి అలియాస్ సాయి సునీల్, శివంగుల భరత్ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరు స్నాప్‌చాట్ వేదికగా మహిళలతో పరిచయం పెంచుకుని, తాము ధనవంతులమని నమ్మించి మోసాలకు పాల్పడేవారు.

నిందితులు అద్దెకు తీసుకున్న ఖరీదైన కార్లలో తిరుగుతూ మహిళలను ఆకర్షించేవారు. నమ్మకం కలిగిన తర్వాత వారి నుంచి బంగారం తీసుకుని, భరత్ కుమార్ ద్వారా మార్కెట్లో విక్రయించేవారని పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు 20 మంది మహిళలు ఈ మోసానికి గురైనట్లు తేలింది.

ప్రధాన నిందితుడు సాగర్‌పై ఇప్పటికే ఆర్సీ పురం, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లలో పలు చీటింగ్ కేసులతో పాటు ఒక రేప్ కేసు కూడా నమోదై ఉంది. ఈ ఘటనపై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి వెల్లడించారు.

ఈ మోసాల్లో ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారేమోనని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని, ఎవరినీ నమ్మవద్దని ప్రజలను పోలీసులు హెచ్చరిస్తున్నారు.