KTR | హైదరాబాద్‌, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : విద్యార్థుల కోసం ఢిల్లీలో ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ దమనకాండపై ఎప్పుడు ధర్నా చేస్తారో చెప్పాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్‌ను ప్రశ్నిస్తూ బాధిత విద్యార్థులకు అండగా నిలుస్తున్నట్టు నాటకాలు ఆడే రాహుల్‌గాంధీ, తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌ విద్యార్థులపై చేస్తున్న దమనకాండపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీశారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు.

ఢిల్లీలో ధర్నా సరే.. హైదరాబాద్‌లోని సీఎం రేవంత్‌ ఇంటి ముందు ఎప్పుడు ధర్నాకు వస్తారో చెప్పాలని ప్రశ్నించారు. విద్యార్థులపై ఎక్కడ దాడి జరిగినా ఖండించాల్సిన బాధ్యత రాహుల్‌గాంధీపై ఉన్నదని పేర్కొన్నారు. రాజ్యాంగ హక్కులు ఢిల్లీలోని విద్యార్థులకేనా..? తెలంగాణ విద్యార్థులకు వర్తించవా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో విద్యార్థులపై లాఠీచార్జ్‌ జరుగుతున్నా, ఈడ్చుకెళ్తున్నా, వారి హక్కులను కాలరాస్తున్నా రాహుల్‌గాంధీ స్పందించకపోవడం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని విమర్శించారు. తెలంగాణలో పోలీస్‌ లాఠీలపై కాంగ్రెస్‌ పార్టీ గుర్తు ఉన్నందుకే ఆయన మౌనంగా ఉంటున్నారని ఎద్దేవాచేశారు.

తెలంగాణలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌ను కూడా రాహుల్‌ ఖండించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్‌ చేయాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల హకుల విషయంలో రాజకీయాలకు అతీతంగా నిలబడుతారా?.. సర్కార్‌ దమనకాండకు రాజకీయ రక్షణ కల్పిస్తారా? అని రాహుల్‌ను ప్రశ్నించారు. తెలంగాణలో సర్కార్‌ దాష్టీకంపై స్పందించకుంటే విద్యార్థులపై రాహుల్‌ది కపట ప్రేమేనని రాష్ట్ర ప్రజలు భావించాల్సి వస్తుందని కేటీఆర్‌ పేర్కొన్నారు.