నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇటీవల సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కృతి సనన్ నటించిన గివా జువెలరీ రక్షా బంధన్ ప్రకటనలో ఆమె ధరించిన దుస్తులపై కంగనా అభ్యంతరం వ్యక్తం చేశారు. సోదరుడికి రాఖీ కట్టే సమయంలో బ్రాలెట్ తరహా బ్లౌజ్ ధరించడం అవసరమా అని ఆమె ప్రశ్నించారు.

సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్న పండుగల్లో మహిళలు ఇతర దుస్తులను ఎందుకు ఎంచుకోకూడదని కంగనా నిలదీశారు. ఈ వ్యాఖ్యల తర్వాత, కంగనా గతంలో జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్నప్పటి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట ాయి. ముఖ్యంగా 63వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఆమె ధరించిన దుస్తులపై నెటిజన్లు చర్చ మొదలుపెట్టారు.

అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ చిత్రానికి ఉత్తమ నటి అవార్డును అందుకునేటప్పుడు, కంగనా లెబనీస్ డిజైనర్ జార్జెస్ చక్రా రూపొందించిన లేత గులాబీ రంగు ఆఫ్-షోల్డర్ గౌనును ధరించారు. కంగనా, కృతి సనన్ అవార్డులు అందుకుంటున్న దృశ్యాలను పక్కపక్కన పెట్టి సోషల్ మీడియా యూజర్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. సాంస్కృతిక విలువలు, వస్త్రధారణపై పాఠాలు చెప్పే కంగనా, ముందుగా తనను తాను పరిశీలించుకోవాలని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

రాణి ముఖర్జీ, అలియా భట్ వంటి ఇతర నటీమణులు అవార్డుల వేడుకల్లో చీరలు ధరించగా, కంగనా భిన్నమైన దుస్తుల్లో కనిపించారని మరికొందరు గుర్తు చేస్తున్నారు. అయితే, కంగనాకు మద్దతుగా కూడా కొందరు నెటిజన్లు వాదనలు వినిపిస్తున్నారు. అవార్డుల వేడుకకు, మతపరమైన పండుగకు మధ్య తేడా ఉంటుందని వారు పేర్కొంటున్నారు.

రాష్ట్రపతి భవన్‌లో జరిగే అధికారిక కార్యక్రమాల్లో పాశ్చాత్య తరహా దుస్తులు ధరించడం చట్టబద్ధమేనని, ఆ గౌను గౌరవప్రదంగా ఉందని కంగనా మద్దతుదారులు వాదిస్తున్నారు. మరోవైపు, కంగనా గతంలో చీర ధరించి కూడా అవార్డు అందుకున్న విషయాన్ని కొందరు నెటిజన్లు ప్రస్తావించారు. 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ చిత్రానికి ఉత్తమ నటి అవార్డును అందుకున్న సమయంలో ఆమె చీరలో కనిపించారు.

ఈ నేపథ్యంలో, వస్త్రధారణ మరియు సాంస్కృతిక సందర్భాల గురించి సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.