క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు గడువు తేదీ ముగిసిన వెంటనే బ్యాంకులు లేట్ పేమెంట్ ఫీజులు లేదా పెనాల్టీలు వేయడాన్ని RBI నిలిపివేసింది. ఇకపై బిల్లు కట్టడానికి వినియోగదారులకు మూడు రోజుల అదనపు సమయం లభిస్తుంది. ఈ మూడు రోజుల గడువు ముగిసిన తర్వాతే బ్యాంకులు పెనాల్టీలు విధించే అవకాశం ఉంటుంది.

మూడు రోజుల కంటే ఎక్కువ కాలం బిల్లు పెండింగ్‌లో ఉంటేనే, ఆ వివరాలను క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు (వ్యక్తుల అప్పులు, చెల్లింపుల చరిత్రను నమోదు చేసే సంస్థలు) పాస్ట్ డ్యూగా నివేదించాలని బ్యాంక్ సంస్థలకు RBI స్పష్టం చేసింది. దీనివల్ల వినియోగదారులకు కొంత ఊరట లభిస్తుంది.

అంతేకాకుండా, ఆలస్య రుసుములను లెక్కించే విధానంలో కూడా మార్పులు వచ్చాయి. ఇకపై బిల్లు మొత్తంపై కాకుండా, గడువు తేదీ నాటికి చెల్లించకుండా మిగిలి ఉన్న బకాయిపై మాత్రమే బ్యాంకులు పెనాల్టీలు విధించాలి. ఉదాహరణకు, 50 వేల రూపాయల బిల్లులో 30 వేలు చెల్లిస్తే, మిగిలిన 20 వేల రూపాయలపై మాత్రమే పెనాల్టీ పడుతుంది.

క్రెడిట్ కార్డును రద్దు చేయాలని కోరితే, ఏడు పని దినాల్లోగా ఆ ప్రక్రియను పూర్తి చేయాలని కూడా RBI ఆదేశించింది. ఒకవేళ ఏడు రోజుల్లో కార్డు క్లోజ్ చేయకపోతే, కార్డు జారీ చేసిన సంస్థ ప్రతి రోజుకు 500 రూపాయల చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, వినియోగదారులు తమ బిల్లింగ్ సైకిల్‌ను అంటే బిల్లు వచ్చే తేదీలను ఎప్పుడైనా మార్చుకునే వెసులుబాటును కూడా RBI కల్పించింది.

అయితే, మినిమం బిల్లు చెల్లించినా మిగిలిన బకాయిపై వడ్డీ పడుతుందని గుర్తుంచుకోవాలి. ఈ బకాయిలను అలాగే ఉంచితే కాలక్రమేణా అప్పు భారం పెరుగుతుంది. కాబట్టి క్రెడిట్ కార్డులు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని RBI సూచిస్తోంది.