దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయనే ప్రచారాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ తోసిపుచ్చింది. ఈ మేరకు గురువారం అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులకు కేంద్రం లేఖ రాసింది. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కేసులు కేవలం సీజనల్ ట్రెండ్‌లో భాగంగా వస్తున్న స్వల్ప పెరుగుదల మాత్రమేనని, గత ఏడాది ఇదే కాలంలో ఉన్న పరిస్థితికి ఇది అనుగుణంగానే ఉందని కేంద్రం వివరించింది.
భారత వైద్య పరిశోధనా మండలి (ICMR), ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP) మరియు సీఎంసీ వెల్లూరు (CMC Vellore) సంస్థలు వైరస్ వ్యాప్తి, వేరియంట్లపై నిరంతరం పరిశోధనలు చేస్తున్నాయని కేంద్రం తెలిపింది. వర్షాకాలంలో వైరల్ ఫ్లూ కేసులు సాధారణంగానే పెరుగుతాయని, కోవిడ్ కూడా అందులో ఒక భాగమేనని పేర్కొంది. ప్రజలను భయాందోళనకు గురిచేసే కొత్త వేరియంట్లు ఏవీ బయటపడలేదని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల అధికారులతో కూడా పరిస్థితిని సమీక్షించినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం అదనపు ఆంక్షలు లేదా చర్యలు చేపట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే, వృద్ధులు మరియు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే వారి విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రాష్ట్రాలు డిసీజ్ సర్వైలెన్స్‌ను ఎప్పటిలాగే కొనసాగించాలని కేంద్రం ఆదేశించింది. జీనోమిక్ సర్వైలెన్స్ ద్వారా దేశవ్యాప్త కోవిడ్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. పుకార్లను నమ్మకుండా కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ప్రజలకు సూచించింది.








