ఖమ్మం జిల్లా రూరల్ మండలం చింతపల్లిలో ఆదివారం వ్యవసాయ కూలీలు, రైతులు కలిసి వరినాట్లు వేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ పాటలతో సందడి చేశారు. ‘సారే కావాలంటున్నది తెలంగాణ పల్లెలల్లా’, ‘మళ్లీ కారే రావాలంటున్నది తెలంగాణ పల్లెలల్లా’, ‘గులాబీల జెండాలమ్మ’ వంటి పాటలను పాడుతూ వారు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు.

కేసీఆర్ హయాంలో అమలు చేసిన రైతుబంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటూ కూలీలు పాటలు ఆలపించారు. వరి నారు కట్టలతో పొలంలో ఇంగ్లీష్ అక్షరాలతో KCR అని రాసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రైతులు తోట జగన్, శ్రీనివాసరావు, నాగబాబుతో పాటు పలువురు వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు. పొలం పనుల్లో ఉన్న కూలీల ఉత్సాహాన్ని, గులాబీ జెండాలను చూసి అటుగా వెళ్తున్న వారు ఆసక్తిగా గమనించారు.