ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం బల్లునగర్ తండాకు చెందిన యువతి మూడు నెలల క్రితం అదృశ్యమైంది. ఈ ఏడాది మే నెలలో ఆమె తల్లిదండ్రులు కారేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

యువతి తనతో పాటు ఫోన్ తీసుకెళ్లకపోవడంతో ఆమెను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. దీంతో ఆచూకీ కనుగొనే ప్రక్రియలో కొంత ఆలస్యమైందని కారేపల్లి ఎస్ఐ బైరు గోపి తెలిపారు.

చివరకు పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి యువతి ఉన్న చోటును గుర్తించారు. సోమవారం ఆమెను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేసిన హైదరాబాద్‌కు చెందిన రుకుమ్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.