పేద కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహాల కోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆరోపించారు. ఈ పథకాలను కొనసాగించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. పలుచోట్ల మహిళలు బతుకమ్మ ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు.
వనపర్తిలో జరిగిన కదనభేరిలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పాల్గొనగా, మహబూబ్‌నగర్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నిరసన చేపట్టారు. ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఇచ్చోడలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఆసిఫాబాద్‌లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, గజ్వేల్‌లో నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి తమ ప్రాంతాల్లోని అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. సత్తుపల్లిలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కల్లూరులో బీఆర్‌ఎస్ నాయకులు భారీ బైక్ ర్యాలీలు నిర్వహించి సబ్ కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. బాన్సువాడ, సూర్యాపేట, మంథని, వరంగల్ వంటి ప్రాంతాల్లో కూడా స్థానిక నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.
ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకాలను నీరుగారిస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెడతామని బీఆర్‌ఎస్ నేతలు హెచ్చరించారు. కేసీఆర్ హయాంలో ప్రారంభమైన ఈ పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయవద్దని వారు డిమాండ్ చేశారు. నిరసనలు ముగిసిన తర్వాత ఆయా ప్రాంతాల్లోని కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేయడంతో ఈ కార్యక్రమాలు ముగిశాయి.








