కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగించకుండా తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తుమ్మిడిహెట్టి విషయంలో కేసీఆర్ చొరవ చూపినా మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాల్సి వచ్చిందన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 33 నెలలుగా మాటలకే పరిమితమైందని, కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించుకోవడం లేదని విమర్శించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు బాగున్నాయని కేంద్ర జల, విద్యుత్ పరిశోధనా సంస్థ ఇచ్చిన నివేదిక ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదన్నారు.

మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగినా ఇప్పటివరకు మరమ్మతులు చేయలేదని ఆరోపించారు. కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేసి నీటిని ఎత్తిపోసుకోవాలని డిమాండ్ చేశారు. రెండు నెలల క్రితమే కేటీఆర్ నేతృత్వంలో అక్కడికి వెళ్లి ఇదే విషయాన్ని కోరామని తెలిపారు. రూ.200 కోట్లతో మేడిగడ్డ పియర్‌కు మరమ్మతులు చేసి, కాఫర్ డ్యామ్ ద్వారా నీటిని లిఫ్ట్ చేయవచ్చన్నారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే కారణంతోనే ప్రభుత్వం కాళేశ్వరం నీటిని వినియోగించడం లేదని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, కేసీఆర్ తిరిగి రావాలని కోరుకుంటున్నారని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.