కాకినాడలో పంచాయతీరాజ్ ఏఈ (అసిస్టెంట్ ఇంజనీర్) నూకరాజు కుటుంబ సభ్యుల ఆత్మహత్య ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన షేక్ సాధిక్ ఖాన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో భాగంగా సాధిక్ ఖాన్ చేసిన నేరాలకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
తనకన్నా పదేళ్లు పెద్దవారైన సౌజన్యతో సాధిక్ ఖాన్ పరిచయం పెంచుకున్నాడు. ఆమెకు సంబంధించిన వ్యక్తిగత వీడియోలు, సంభాషణలను ఉపయోగించి సాధిక్ ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. ఈ ఒత్తిడి వల్లే సౌజన్య కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు గుర్తించారు.
సౌజన్య భర్త జగదీశ్ రెడ్డి నరాల సంబంధిత సమస్యతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆ సమయంలోనే జగదీశ్ రెడ్డిని హత్య చేసేందుకు సాధిక్ పథకం వేశాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మరుసటి రోజే, జగదీశ్ రెడ్డి తీసుకునే ప్రొటీన్ పౌడర్‌లో సైనైడ్ అనే విషపూరిత రసాయనాన్ని కలిపి ఇచ్చాడు. ఈ సైనైడ్‌ను ఒక బంగారం వ్యాపారి వద్ద కొనుగోలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
జగదీశ్ రెడ్డి మరణం తర్వాత, వారి కుమారుడు రియాన్ష్ కార్తికేయ రెడ్డి పేరు మీద లీగల్ హెయిర్ సర్టిఫికెట్ (వారసత్వ ధ్రువీకరణ పత్రం) తీసుకోవాలని సాధిక్ ప్రయత్నించాడు. సౌజన్యను పెళ్లి చేసుకుని, నూకరాజు కుటుంబానికి చెందిన ఆస్తులను, ముఖ్యంగా ఒక స్థలాన్ని అమ్మేయాలని నిందితుడు ప్లాన్ చేశాడు. ఆత్మహత్య తర్వాత సాధిక్ ఖాన్ పరారయ్యాడు. ఎవరూ గుర్తుపట్టకుండా గడ్డం తీసేసిన అతనికి, గతంలో షూటింగ్ శిక్షణ పొందిన వ్యక్తులు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు.
మరోవైపు, జగదీశ్ రెడ్డి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని సాధిక్ ఖాన్ విష ప్రయోగంతో చంపాడని, ఈ హత్యలో తన కోడలు సౌజన్య కూడా సహకరించిందని ఆయన ఆరోపించారు. తన మనవడు రియాన్ష్ రెడ్డిని తనకు అప్పగించాలని ఆయన కోరారు. ఈ ఘటనలో మరిన్ని వివరాలు సేకరించేందుకు పోలీసుల విచారణ కొనసాగుతోంది.







