జూలూరుపాడు, ఆగస్టు 25 : పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ, భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించే లక్ష్యంతో జూలూరుపాడు మండలంలో మంగళవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించారు. మండలంలోని మొత్తం 24 గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ స్థలాలు, పాఠశాలల ప్రాంగణాల్లో పంచాయతీకి 200 చొప్పున విస్తృతంగా మొక్కలు నాటారు. పాపకొల్లు–కొత్తూరు అలాగే జూలూరుపాడు గ్రామ పంచాయతీల పరిధిలోని ఏవెన్యూ ప్లాంటేషన్‌లో చేపట్టిన కార్యక్రమంలో మండల పరిషత్ ప్రత్యేక అధికారి శ్రీలత ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాటిన ప్రతి మొక్కను సంరక్షించి, మహావృక్షంగా ఎదిగేలా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. పచ్చదనం పెంపొందించడం ద్వారానే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి తాళ్లూరి రవి, ఎంపీఓ తులసీరామ్, ఏపీఓ రామారావు, టీఏ నాగమణి, ఎఫ్ఏ షరీఫ్, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
నడిగూడెం: ఆంధ్రప్రభ మండలంలోని వల్లాపురం గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వల్లాపురం శివారులో ఉన్న బాల కోటేశ్వర స్వామి దేవాలయం గుట్టపై గ్రామ సర్పంచ్ కేసగాని సరిత లక్ష్మణ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ కేసగాని సరిత లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచి ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు.
ప్రతి ఒక్కరూ వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి పోషణ బాధ్యత కూడా తీసుకోవాలని అన్నారు. వర్షాలు సరైన సమయంలో పడాలన్న, వాతావరణం సమతుల్యంగా ఉండాలన్న మొక్కలను కాపాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రణబోతు.మల్లారెడ్డి, ఉప సర్పంచ్ కోట చంద్రశేఖర్ రెడ్డి, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు దేవాలయ కమిటి చైర్మన్ పల్లా.మోహన్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ తంగెళ్ల నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.








