దేవరకొండకు చెందిన రోజువారీ కూలీల కుమార్తె పరిమళ, ఐఐటీ మద్రాస్‌లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. తాజాగా జర్మనీలోని ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చేసేందుకు ఆమె సీటు సాధించింది. అయితే, కుటుంబ ఆర్థిక ఇబ్బందులు ఆమె విదేశీ విద్యకు అడ్డంకిగా మారాయి.
ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్ గుర్తించి, విద్యార్థిని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారి పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే, వెంటనే రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు.
పరిమళ ప్రతిభను, ఉన్నత చదువుల పట్ల ఆమెకున్న అంకితభావాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభినందించారు. పేదరికం వల్ల విద్యార్థిని కలలు ఆగిపోకూడదనే ఉద్దేశంతో, 'కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్' ద్వారా ఆమెకు రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని మంత్రి అందజేశారు.
ఈ సాయంతో పరిమళ జర్మనీలో తన మాస్టర్స్ విద్యను కొనసాగించేందుకు మార్గం సుగమమైంది. మంత్రి వెంకట్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ఆ విద్యార్థిని ఉన్నత చదువులకు భరోసానిచ్చింది.







