కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బుధవారం జరిగిన ఒక చిన్న గొడవ పోలీసుల చర్యలతో పెద్ద వివాదంగా మారింది. వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌కు చెందిన అంగరిక రాజు అనే యువకుడు, స్థానిక స్వీట్ హౌస్‌లో తినుబండారాల ధర విషయంలో యజమానిని ప్రశ్నించాడు.

ఈ క్రమంలో స్వీట్ హౌస్ నిర్వాహకులు రాజుపై దాడి చేశారని సమాచారం. రాజు ఆ స్వీట్ హౌస్‌ను మూసివేసేందుకు ప్రయత్నించగా, యజమానితో పాటు అక్కడికి వచ్చిన పోలీసులు అతడిని అడ్డుకున్నారు. పోలీసులు స్వీట్ హౌస్ యజమానికే మద్దతు తెలపడంతో, రాజు నిరసనగా రోడ్డుపై బైఠాయించాడు.

దీంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రాజును నడిరోడ్డుపై లాక్కెళ్లారు. పోలీస్ స్టేషన్ సమీపంలో అతడిని విచక్షణారహితంగా కొట్టడంతో రాజుకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో తీవ్ర మనస్తాపానికి గురైన రాజు, రైల్వే పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకుంటానని రోదించాడు.

పోలీసుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ చౌక్ వద్దకు చేరుకుని పోలీసుల దాడికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

చివరకు సీఐ రామకృష్ణ అక్కడికి చేరుకుని బాధితుడితో మాట్లాడారు. జరిగిన ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. గాయపడిన రాజును దవాఖానకు తరలించడంతో ఈ వివాదం సద్దుమణిగింది.