జమ్మికుంటకు చెందిన కావ్య, అఖిల్ అనే యువతీ యువకులకు వివాహం నిశ్చయమైంది. ఈ నెల 16న ఆదివారం వీరిద్దరి వివాహం జరగాల్సి ఉండగా, చివరి నిమిషంలో వరుడు అఖిల్ పెళ్లికి నిరాకరించాడు. అప్పటికే పెళ్లి పనులు పూర్తయి, బంధువులకు శుభలేఖలు కూడా పంచడంతో వధువు కుటుంబం షాక్‌కు గురైంది.

ఈ ఘటనపై జమ్మికుంటలో పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. పెళ్లి రద్దు చేసుకున్నందుకు వధువు కుటుంబానికి పరిహారం ఇస్తామని వరుడి తరపు బంధువులు ప్రతిపాదించారు. అయితే, డబ్బులు వద్దు కేవలం క్షమాపణ చెప్పాలని వధువు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

పెద్దల సమక్షంలో వరుడు, అతని తల్లిదండ్రులు క్షమాపణలు కోరారు. అయితే, వధువు కాళ్లు మొక్కాలని పంచాయతీ పెద్దలు పట్టుబట్టడంతో పరిస్థితి మారింది. అందుకు వరుడు, అతని కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.

దీంతో ఇరు కుటుంబాల బంధువుల మధ్య వాగ్వాదం మొదలైంది. తమను మోసం చేసినందుకు వరుడి కుటుంబం మట్టిగొట్టుకుపోతుందని వధువు తల్లి శాపనార్థాలు పెట్టింది. ఈ వ్యవహారం జమ్మికుంటలో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

నిశ్చితార్థం, లగ్న పత్రికలు పంచిన తర్వాత వరుడు పెళ్లి ఎందుకు వద్దనుకున్నాడనే దానిపై స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ వివాహ రద్దుకు సంబంధించి తదుపరి పరిణామాలు వేచి చూడాల్సి ఉంది.