బాహుబలి సినిమాలో భల్లాల దేవుడిగా కండలు తిరిగిన దేహంతో కనిపించిన దగ్గుబాటి రానా, ఇప్పుడు పూర్తిగా సన్నబడి కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో ఆయన కొత్త ఫోటోలు చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఆరోగ్య సమస్యల కారణంగా యూఎస్‌లో సర్జరీ చేయించుకున్న రానా, ఆ తర్వాత కోలుకుని సాధారణ స్థితికి వచ్చారు. ఇప్పుడు మళ్లీ ఆయన లుక్ మారడంతో, ఆరోగ్య సమస్యలు ఏమైనా తలెత్తాయా అని అభిమానులు ఆరా తీస్తున్నారు.
అయితే, రానా ఈ మార్పును తన కొత్త సినిమా కోసం చేసుకున్నట్లు సినీ వర్గాల సమాచారం. ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న 'జై హనుమాన్' చిత్రంలో రానా అశ్వద్ధామ పాత్రను పోషిస్తున్నారని తెలుస్తోంది. మహాభారతంలో శ్రీకృష్ణుడి శాపం వల్ల యుగాల తరబడి భూమిపై సంచరించే అశ్వద్ధామ పాత్రలో సహజంగా కనిపించేందుకే ఆయన బరువు తగ్గి, ఈ ప్రత్యేక లుక్‌ను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
హనుమాన్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో, కాంతారా ఫేం రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే, రానా కొత్త లుక్ మరియు అశ్వద్ధామ పాత్రపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రానా కూడా తన తాజా రూపాన్ని గురించి ఇంకా స్పందించలేదు.







