సాధారణంగా ఇళ్లలో బల్లులు కనిపించడం సహజం. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బల్లిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. ఇది ఇంట్లో కనిపించే ప్రదేశం, సమయాన్ని బట్టి భవిష్యత్తులో జరిగే పరిణామాలను అంచనా వేయవచ్చని నమ్ముతారు.
పూజా గదిలో బల్లి కనిపిస్తే అది అత్యంత శుభప్రదమని పండితులు చెబుతారు. ఇది లక్ష్మీదేవి అనుగ్రహం ఉందని, త్వరలోనే ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనలాభం కలుగుతుందని సూచిస్తుంది. అలాగే, దీపావళి రాత్రి బల్లి కనిపిస్తే ఆ ఏడాది మొత్తం కుటుంబంలో అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు వెల్లివిరుస్తాయని విశ్వసిస్తారు. కొత్త ఇంట్లోకి వెళ్లేటప్పుడు బల్లి కనిపించడం పూర్వీకుల ఆశీస్సులకు నిదర్శనంగా భావిస్తారు.
మరోవైపు, బల్లుల ప్రవర్తనను బట్టి కూడా ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. రెండు బల్లులు కలిసి ఉంటే పాత మిత్రుల కలయిక లేదా కుటుంబ అనుబంధాలు బలపడతాయని అర్థం. అదే సమయంలో, బల్లులు పోట్లాడుకుంటే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు వచ్చే అవకాశం ఉందని, బల్లి వింతగా అరిస్తే ఆర్థిక నష్టం లేదా చేదు వార్తలకు సూచన అని పండితులు హెచ్చరిస్తారు.
ఇంట్లో చనిపోయిన బల్లి కనిపించడం లేదా దానిపై పొరపాటున కాలు వేయడం అశుభంగా పరిగణిస్తారు. ఇది ప్రతికూల శక్తులకు లేదా ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. ఒకవేళ ఇలాంటి అశుభ సంకేతాలు ఎదురైతే, చేతులు, కాళ్లు శుభ్రం చేసుకుని పూజా గదిలో దీపం వెలిగించి, గంగాజలం చల్లుకోవడం ద్వారా ప్రతికూల ఫలితాలు తొలగిపోతాయని నమ్ముతారు.
గమనిక: ఈ సమాచారం కేవలం మత విశ్వాసాలు, పండితుల సూచనల ఆధారంగా అందించినది మాత్రమే. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.








