ఆదిపురుష్ భామ కృతి సనన్ ఊహించని విధంగా వివాదంలో చిక్కుకుంది. తాను నటించిన రక్షాబంధన్‌ యాడ్‌తో విమర్శల పాలైంది. ఓ కుక్కకు రాఖీ కడుతూ.. సంప్రదాయ దుస్తులు కాకుండా వెస్టర్న్ డ్రెస్‌లో కనిపించింది. ఇదే వివాదానికి కారణమైంది. హిందూ పండుగను అవమానించేలా కృతి సనన్ వ్యవహరించారంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోదరుడికి ప్రేమతో కట్టే రాఖీని కుక్కకు కట్టడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.

తాజాగా తనపై వస్తున్న విమర్శలపై బాలీవుడ్ భామ స్పందించారు. పండుగ అనేది భావోద్వేగాలు, సంప్రదాయాలతో కూడుకున్నదని తెలిపింది. అంతేకానీ ఒక మహిళ ధరించే దుస్తులపై ప్రభావం ఉండదని రాసుకొచ్చింది. ఈ వేడుకల్లో తన పెంపుడు జంతువును చేర్చాలనే ఆలోచన సరైందేనని.. కుక్కలు కూడా కుటుంబంలో భాగమేనని వెల్లడించింది. ఈ వివాదంపై ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది.

కృతి తన ఇన్‌స్టాలో రాస్తూ..' మన పండుగల సారం మనం ధరించే దుస్తుల్లో ఉండదు. అది సంప్రదాయాల పట్ల మీకు ఉండే భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. రక్షాబంధన్ అనేది ఒక రక్షణ బంధం. నేను, నా సోదరి ఒకరికొకరం రాఖీ కట్టుకుంటాం. ఒక సోదరుడు ఎలాగైతే రక్షణగా ఉంటారో.. మేము కూడా అలాగే రక్షించుకోగలమని మాకు తెలుసు. తాను, తన సోదరి ఒకరి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయువు కోసం ప్రార్థించుకుంటాం. ఇది మా ఇంట్లో కుక్కలకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే అవీ కూడా మా కుటుంబంలో సభ్యులే కదా " అని పోస్ట్ చేసింది.

అంతేకాకుండా మనం మహిళలు ఏమి ధరించాలో చెప్పడం ఎప్పుడు ఆపుతామని కృతి సనన్ ప్రశ్నించింది. ఒక మహిళ తన సంస్కృతి పట్ల చూపే గౌరవాన్ని ఆమె దుస్తులను బట్టి అంచనా వేసే పద్ధతిని కృతి తప్పుపట్టింది. ఎథ్నిక్ ఫ్యాషన్ సంవత్సరాలుగా అభివృద్ధి చెందింది.. కానీ ఇప్పటికీ ఒక మహిళ తన సంస్కృతి పట్ల చూపే గౌరవాన్ని కేవలం ఆమె దుస్తులతోనే కొలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మన సంస్కృతి, సంప్రదాయాలు అనే మహిళ హృదయంలో ఉంటాయి.. అంతే కానీ ఆమె మెడలో కాదంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే కృతి ఇటీవల షాహిద్ కపూర్, రష్మిక మందన్నలతో కలిసి రొమాంటిక్ కామెడీ-డ్రామా కాక్‌టెయిల్ -2లో కనిపించింది. గతేడాది 'తేరే ఇష్క్ మే'లో ధనుష్ సరసన కూడా హీరోయిన్‌గా మెప్పించింది.