హైదరాబాద్ నగరంలో రాత్రిపూట ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. రాత్రి వేళల్లో క్యాబ్లు, ఆటోల కోసం అధిక ధరలు చెల్లించాల్సి వస్తున్న ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, గ్రేటర్ ఆర్టీసీ రాత్రిపూట బస్సులను నడపాలని నిర్ణయించింది.

ఈ నెల 29వ తేదీ నుంచి మొదటి దశలో ఆరు మార్గాల్లో ఈ సేవలు మొదలవుతాయి. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఈ బస్సులు తిరుగుతాయి. ప్రయాణికుల రద్దీని బట్టి ప్రతి అరగంటకు ఒక బస్సును నడిపేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీ మీదుగా కొండాపూర్ వరకు 10హెచ్ బస్సులు, బాచుపల్లి నుంచి వేవ్‌రాక్ వరకు 195డబ్ల్యూ బస్సులు రాత్రివేళల్లో అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి హయత్ నగర్ వెళ్లే 290యూ బస్సులు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఆల్ఫా హోటల్ నుంచి బయలుదేరుతాయి. దీంతో రాత్రి వేళల్లో రైళ్లలో వచ్చే ప్రయాణికులకు ఇళ్లకు చేరుకోవడం సులభం అవుతుంది.

వీటితో పాటు సికింద్రాబాద్ నుంచి పటాన్‌చెరు, కోఠి నుంచి పటాన్‌చెరు, కోఠి నుంచి హైటెక్ సిటీ మీదుగా పటాన్‌చెరు మార్గాల్లో కూడా రాత్రి బస్సులు నడుస్తాయి. ఈ రూట్లలో ప్రతి గంటకు ఒక బస్సు లేదా రద్దీని బట్టి అరగంటకు ఒక బస్సును నడపనున్నారు.

ప్రస్తుతం ఎంపిక చేసిన ఆరు మార్గాలతో ఈ సేవలు మొదలవుతున్నాయి. భవిష్యత్తులో నగరంలోని ఇతర ప్రాంతాలకు, పర్యాటక ప్రదేశాలకు కూడా ఈ రాత్రిపూట బస్సు సర్వీసులను విస్తరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.