హైదరాబాద్‌లోని చాపెల్ రోడ్డులో సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. గన్‌ఫౌండ్రీలోని ఎస్‌బీఐ బ్యాంక్ ఉద్యోగి సునీత పని ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా, నిర్మాత బొమ్మకు మురళి కారు ఆమెను వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో సునీత కాలు విరగడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సునీతను చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఖర్చుల కోసం కారు యజమాని బొమ్మకు మురళికి ఫోన్ చేసి సాయం కోరారు. అయితే, ఆయన బాధ్యతారాహిత్యంగా స్పందిస్తూ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించారు.

“కారు నాదే, కానీ నేను పైసా కూడా ఇవ్వను.. కావాలంటే ప్రమాదం చేసిన డ్రైవర్‌నే చంపుకోండి” అని మురళి దురుసుగా మాట్లాడారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబం అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బొమ్మకు మురళి గతంలో టెక్నోక్రాట్, సామాజిక కార్యకర్తగా పనిచేసి, ఆ తర్వాత 'శరణం గచ్ఛామి' సినిమాతో నిర్మాతగా మారారు.