హైదరాబాద్‌లో కళాకారుల కోసం కొత్తగా ఏక్‌చిత్ర ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటు చేశారు. పెయింటింగ్, శిల్పకళ, సెరామిక్స్ (మట్టితో చేసే కళాఖండాలు), ఇన్స్టాలేషన్స్ (ప్రదర్శన కోసం ప్రత్యేకంగా అమర్చే కళాకృతులు), ఫొటోగ్రఫీ, మిక్స్డ్ మీడియా వంటి వివిధ కళారూపాలను ఇక్కడ ప్రదర్శించనున్నారు. ఈ గ్యాలరీని ఆర్టిస్ట్, క్యురేటర్ (కళా ప్రదర్శనలను నిర్వహించే వ్యక్తి) అన్నపూర్ణ మడిపడిగ స్థాపించారు.

ఈ గ్యాలరీలో పర్మనెంట్ ప్రింట్ మేకింగ్ స్టూడియోను కూడా ఏర్పాటు చేశారు. ప్రింట్ మేకింగ్ అంటే అచ్చుల ద్వారా చిత్రాలను రూపొందించే ఒక ప్రత్యేక కళా ప్రక్రియ. ఈ మాధ్యమం ద్వారా కళాకారులను ఒకరితో ఒకరిని అనుసంధానించడం, వారికి శిక్షణ, వర్క్ షాప్స్ (కళా నైపుణ్యాల కోసం నిర్వహించే శిక్షణ తరగతులు), చర్చలు, స్క్రీనింగ్స్ వంటి కార్యక్రమాలను నిర్వహించడం ఈ గ్యాలరీ ప్రధాన ఉద్దేశ్యం.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్ట్ కలెక్టర్ అంజూ పొద్దార్, దర్శకులు దేవకట్టా, వెంకటేశ్ మహా, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, కళాకారులు బీఏ రెడ్డి, శంకర్ పామర్తి పాల్గొన్నారు. ఎంఎస్ఎస్ రియాల్టీ, రెస్టారెంట్ అనగనగా తెలుగు కలినరీ టేల్స్ ఈ ప్రారంభోత్సవానికి భాగస్వామ్యులుగా మద్దతునిచ్చాయి. వర్ధమాన కళాకారులతో పాటు ప్రఖ్యాత కళాకారులకు కూడా ఇది అనువైన వేదికగా ఉంటుందని అన్నపూర్ణ తెలిపారు.

ప్రస్తుతం ఈ గ్యాలరీ 'ట్రాన్సిషన్: ఎ కంటిన్యుటీ టు చేంజ్ - యాన్ ఓడ్ టు ఐడెంటిటీస్ ఇన్ ఫ్లక్స్' అనే ఎగ్జిబిషన్‌తో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు తమ శిల్పకళ, పెయింటింగ్, సెరామిక్స్, ప్రింట్ మేకింగ్ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఫైన్ ఆర్ట్స్, క్రాఫ్ట్, డెకరేటివ్ ఆర్ట్స్ మధ్య ఉన్న సంబంధాన్ని ఈ ప్రదర్శన గుర్తుచేయనుంది.

భవిష్యత్తులో కళాకారులు, డిజైనర్లు, ఆర్కిటెక్ట్స్ (భవన నిర్మాణ నిపుణులు), పరిశోధకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు ఏక్‌చిత్ర ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా వారసత్వ ప్రదేశాలను సాంస్కృతిక వేదికలుగా మార్చే 'లింగ్ టెంపుల్', తెలుగు రాష్ట్రాల కళా చరిత్రకు అంకితమైన 'కీర్తనం', హైదరాబాద్‌లోని మెట్ల బావులను కళా వేదికలుగా మార్చే 'బావ్లీ ఆర్ట్ సంగం' వంటి ప్రాజెక్టులను చేపట్టనున్నారు. కళను ప్రేక్షకులకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ గ్యాలరీ తన కార్యకలాపాలను కొనసాగించనుంది.