హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ జోన్లలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా నకిలీ ధృవపత్రాలను చూపిస్తూ వైద్యులుగా చెలామణి అవుతున్న 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అర్హత లేని వ్యక్తులు క్లినిక్‌లను ఏర్పాటు చేసి ప్రజలకు ఇంజక్షన్లు, సెలైన్లు, మందులను ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి అక్రమ వైద్యం చేస్తున్న వారిపై నిఘా పెట్టిన అధికారులు, విస్తృతంగా సోదాలు నిర్వహించి ఈ విషయాన్ని బయటపెట్టారు.
పట్టుబడిన వారిలో పారామెడికల్ కోర్సు పూర్తి చేసిన ఒక మహిళ కూడా ఉంది. ఆమె ఎటువంటి అనుమతులు లేకుండా గత నాలుగేళ్లుగా క్లినిక్ నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఈ తనిఖీల్లో భాగంగా నకిలీ వైద్యులు నిల్వ ఉంచిన మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న 11 మందిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.








