ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్షకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు 'రోహిత్ వేముల తెలంగాణ (ఉన్నత విద్యలో వివక్ష నివారణ) బిల్లు 2026' రూపకల్పనపై మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉన్న క్యాబినెట్ సబ్ కమిటీ గురువారం సచివాలయంలో తొలిసారి సమావేశమైంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో చట్టం అమలుపై కీలక చర్చలు జరిగాయి.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఉదంతం దేశవ్యాప్తంగా సృష్టించిందని, ఆ సమయంలో రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి సంఘీభావం తెలిపారని భట్టి గుర్తు చేశారు. అప్పట్లో తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థుల పక్షాన పోరాటం చేశామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆ హామీని ఇప్పుడు నెరవేరుస్తున్నామని ఆయన వివరించారు. విద్యాసంస్థల్లో ప్రశాంత వాతావరణం కోసం ఈ చట్టాన్ని అత్యంత పటిష్టంగా రూపొందిస్తున్నట్లు తెలిపారు.
బిల్లు తయారీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని, కర్ణాటకలో అమలవుతున్న ఉత్తమ పద్ధతులను పరిశీలించి ముసాయిదా నివేదికను సిద్ధం చేయాలని సంబంధిత శాఖ సెక్రటరీకి సూచించారు. ఈ చట్టం రూపకల్పనలో పారదర్శకత కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు.
రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నుంచి సలహాలు, సూచనలను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి ముసాయిదాలో మార్పులు చేస్తామని భట్టి స్పష్టం చేశారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదం పొందిన తర్వాత ఈ చారిత్రాత్మక బిల్లును త్వరలోనే రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.








