హార్ముజ్ జలసంధిపై అమెరికా పూర్తి నియంత్రణ సాధించిందని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో వెల్లడించారు. అమెరికా నేవీ చేపట్టిన దిగ్బంధాన్ని పలువురు ఉక్కు గోడగా అభివర్ణిస్తున్నారని, దీన్ని తాము కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఇరాన్ తీవ్ర సంక్షోభంలో ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ దేశంలో ద్రవ్యోల్బణం 300 శాతానికి చేరుకుందని, ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ దెబ్బతిన్నదని, ఆ దేశ నాయకత్వం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇరాన్ వద్ద నావికా దళం, వైమానిక దళం లేవని, సైన్యంలోని సిబ్బందికి జీతాలు కూడా అందడం లేదని ట్రంప్ ఆరోపించారు. ఇరాన్ కేవలం మాటలకే పరిమితమవుతోందని, చేతల్లో ఏమీ లేదని విమర్శించారు. తన పోస్టును అల్లాకు ధన్యవాదాలు తెలుపుతూ ఆయన ముగించారు.