గుంటూరుకు చెందిన బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గతంలో టీడీపీలో పనిచేశారు. ఆ తర్వాత జనసేనలో చేరి 2019 ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి లక్షా 29 వేల ఓట్లు సాధించారు. పార్టీలతో సంబంధం లేకుండా అందరు నాయకులతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని స్థానికులు చెబుతుంటారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో, ఆ పార్టీ నేతలు ఆశించిన ది గుంటూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఛైర్మన్ పదవిని బోనబోయిన దక్కించుకున్నారు. వైసీపీ హయాంలోనే ఆయన రెండోసారి కూడా ఆ పదవికి ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన కుమారుడు కౌశిక్ కూడా అదే బ్యాంక్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.
అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బోనబోయిన వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. రెండేళ్ల క్రితం వైసీపీ నేత నరేంద్రరెడ్డి ఇంటిపై దాడి ఘటనలో బోనబోయిన పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి. అలాగే, యాదవ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి సీఎం కావాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా దుమారం రేపాయి.
ఇటీవల గుంటూరులో జరిగిన ఒక కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గన్‌మెన్‌తో బోనబోయిన అనుచరులు గొడవకు దిగి దాడి చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో బోనబోయిన అక్కడే ఉన్నారు. తాజాగా తనను హత్య చేసేందుకు కోటిన్నర రూపాయల సుపారీ ఇచ్చారని వైసీపీ నేత నరేంద్రరెడ్డిపై ఆయన నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ హత్య కుట్ర కేసులో నిందితుడిగా ఉన్న వెంకటేష్ కోర్టులో లొంగిపోయేందుకు వచ్చినప్పుడు, బోనబోయిన తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. ఈ విషయంపై న్యాయమూర్తి పోలీసులకు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగారు. దీంతో బోనబోయిన అనుచరులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తనపై వచ్చిన ఆరోపణలను వైసీపీ నేత నరేంద్రరెడ్డి ఖండించారు. తాను హత్యకు కుట్ర చేయలేదని, ఎన్నికల సమయంలో బోనబోయిన టీడీపీ, వైసీపీ అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకున్నారని నరేంద్రరెడ్డి ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బోనబోయిన వ్యవహారశైలిపై జనసేన పార్టీలో చర్చ జరుగుతోంది.







