ఐపీఎల్ (IPL)లో ముంబై ఇండియన్స్ జట్టును హార్ధిక్ పాండ్యా వీడుతున్నాడనే ప్రచారం నేపథ్యంలో, అతన్ని తిరిగి తమ జట్టులోకి తీసుకునేందుకు గుజరాత్ టైటాన్స్ సిద్ధమైంది. గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్రదర్శనపై విమర్శలు రావడంతో, హార్ధిక్‌ను వేరే జట్టుకు ట్రేడింగ్ చేసేందుకు ముంబై మేనేజ్‌మెంట్ కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం.

కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు కూడా హార్ధిక్‌ను తీసుకునేందుకు ఆసక్తి చూపినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ హార్ధిక్ రాకను స్వాగతిస్తూ, ప్రస్తుత కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌తో కూడా చర్చలు జరిపింది. ట్రేడింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు గుజరాత్ యాజమాన్యం అంగీకారం తెలిపింది.

అయితే, హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీ కావాలనే షరతు విధించడంతో పరిస్థితి మారింది. ఈ నిబంధనకు గుజరాత్ టైటాన్స్ మేనేజ్‌మెంట్ అంగీకరించలేదు. దీంతో హార్ధిక్‌ను తిరిగి జట్టులోకి తీసుకునే ఆలోచన నుంచి ఫ్రాంచైజీ వెనక్కి తగ్గినట్లు గుజరాత్ టైటాన్స్ వర్గాలు వెల్లడించాయి.