ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రవేశపెట్టిన తర్వాత భారత్‌లో టీ20 ఫార్మాట్‌కు ఆదరణ మరింతగా పెరిగింది. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాలు స్థానికంగా టీ20 లీగ్‌లు నిర్వహిస్తూ దేశీ ఆటగాళ్లకు చక్కటి వేదిక కల్పిస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ, బెంగాల్ టీ20 లీగ్‌లు నిర్వహిస్తుండగా.. ఇటీవలే తెలంగాణ కూడా ఈ జాబితాలోకి చేరింది.
మరో టీ20 లీగ్ సంబరంటీజీ20 పేరిట హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహిస్తోంది. జూన్ 21న మొదలైన ఈ లీగ్ జూలై 12న ఫైనల్‌తో ముగియనుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) షెడ్యూల్ విడుదలైంది.
డీపీఎల్ మూడో ఎడిషన్‌ను జూలై 31 నుంచి ఆగష్టు 30 మధ్య నిర్వహించనున్నట్లు ఢిల్లీ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ మంగళవారం వెల్లడించింది. ఈసారి కూడా టీమిండియా స్టార్లు ఈ లీగ్‌లో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు.
టీమిండియా స్టార్లు సిద్ధంభారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌తో పాటు.. హర్షిత్ రాణా డీపీఎల్‌లో భాగం కానున్నాడు. వీరితో పాటు టీమిండియా వెటరన్ పేసర్లు ఇషాంత్ శర్మ, నవదీప్ సైనీ కూడా లీగ్ ఆడనున్నారు.
ఇక ఐపీఎల్ స్టార్లు నితీశ్ రాణా, ఆయుశ్ బదోని, ప్రియాన్ష్ ఆర్య, సూయశ్ శర్మ, దిగ్వేశ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్, యశ్ ధుల్, అనూజ్ రావత్, సిమర్జీత్ సింగ్, హిమ్మత్ సింగ్, హృతిక్ షోకీన్, సార్థక్ రంజన్ తదితరులు డీపీఎల్ బరిలో దిగనున్నారు. అనుభవజ్ఞులైన, యువ ప్లేయర్లతో సమతూకం చేసుకుంటూ ఫ్రాంఛైజీలు తమ జట్లను తయారుచేసుకున్నాయి.
మహిళల లీగ్ కూడా..ఇక మహిళల డీపీఎల్‌ను ఈసారీ ఆటంకాలు లేకుండా కొనసాగించనున్నారు. శ్వేతా సెహ్రావత్, ప్రియా పునియా, సోని యాదవ్, ఆయుశి సోని తదితరులు ఇందులో భాగం కానున్నారు. వీరితో పాటు రైజింగ్ స్టార్లు తనీషా సింగ్, నజ్మా, మోనికా, పూర్వా సివాచ్ కూడా లీగ్లో ఆడనున్నారు.
కాగా పురుషుల డీపీఎల్‌లో గతేడాది.. నితీశ్ రాణా సారథ్యంలో వెస్ట్ ఢిల్లీ లయన్స్ విజేతగా నిలిచింది. మహిళల విభాగంలో శ్వేతా సెహ్రావత్ కెప్టెన్సీలో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ చాంపియన్‌గా అవతరించింది.
డీపీఎల్-2026లో పాల్గొనే పురుష జట్లుసెంట్రల్ ఢిల్లీ కింగ్స్, ఈస్ట్ ఢిల్లీ రైడర్స్, న్యూ ఢిల్లీ టైగర్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, ఔటర్ ఢిల్లీ వారియర్స్, పురానీ ఢిల్లీ 6, సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్.
మహిళల జట్లుసెంట్రల్ కింగ్స్ వుమెన్, ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ వుమెన్, సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ వుమెన్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ వుమెన్.
ఇద్దరి బాలీవుడ్ భామలతో ఇంగ్లండ్ క్రికెటర్ ప్రేమాయణం!








