ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు షాకిస్తూ, అందుబాటు ధరలో ఉన్న ఆరు పాపులర్ ప్లాన్లను నిలిపివేసింది. రూ. 299, రూ. 319, రూ. 579, రూ. 619, రూ. 649, రూ. 799 ధరలు కలిగిన ఈ ప్లాన్లు ఇకపై కస్టమర్లకు అందుబాటులో ఉండవు. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ వంటి ప్రయోజనాలు అందించే రూ. 299 ప్లాన్ తొలగింపు వినియోగదారులపై ప్రభావం చూపనుంది.

కొన్ని ప్లాన్ల విషయంలో ప్రాంతీయంగా మార్పులు కనిపిస్తున్నాయి. రూ. 579 మరియు రూ. 619 ప్లాన్లు దేశంలోని అన్ని టెలికాం సర్కిళ్లలో ఒకేలా లేవు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాల్లో వీటిని తొలగించినట్లు సమాచారం. రూ. 619 ప్లాన్‌లో 60 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1.5GB డేటా, అలాగే రూ. 649 ప్లాన్‌లో 56 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటా వంటి బెనిఫిట్స్ ఉండేవని కంపెనీ పేర్కొంది.

ప్లాన్ల తొలగింపుతో పాటు, ఎయిర్‌టెల్ రూ. 859 ప్లాన్ ధరను రూ. 899కు పెంచింది. ఈ పెంపు ద్వారా అదనపు బెనిఫిట్స్ ఏవీ లభించవు. కొత్తగా రూ. 899 ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 SMS సౌకర్యాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ మార్పులు మీ సర్కిల్‌లో అమల్లో ఉన్నాయో లేదో రీఛార్జ్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలని సూచించడమైనది.

టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) నిబంధనల ప్రకారం, 4G మరియు 5G ప్లాన్లు రెండూ అందుబాటులో ఉండాలని, కస్టమర్లకు ఎంపిక చేసుకునే అవకాశం కల్పించాలని టెలికాం సంస్థలకు సూచించింది. నెట్‌వర్క్ నాణ్యత విషయంలో విఫలమైతే భారీ జరిమానాలు ఉంటాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో రీఛార్జ్ ధరలు, ప్లాన్ల ప్రయోజనాల్లో మరిన్ని మార్పులు ఉంటాయా అనేది వేచి చూడాలి.