ఆంధ్రప్రదేశ్‌ను ప్రముఖ చలనచిత్ర నిర్మాణ కేంద్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ భరత్ భూషణ్, ఎండీ విశ్వనాథన్ మరియు పలు శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
సినిమా షూటింగ్‌ల కోసం అనుమతులు పొందడంలో నిర్మాతలకు ఎదురవుతున్న జాప్యాన్ని తగ్గించడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశ్యం. ఇకపై వివిధ శాఖల అనుమతులను 'సింగిల్ విండో' పద్ధతిలో, 'ఫాస్ట్ ట్రాక్' ప్రాతిపదికన మంజూరు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనివల్ల షూటింగ్‌ల నిర్వహణ ప్రక్రియ సులభతరం అవుతుందని ఎఫ్‌డీసీ చైర్మన్ భరత్ భూషణ్ తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అనేక సినిమాల షూటింగ్‌లు విజయవంతంగా జరుగుతున్నాయని, ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే చిత్రనిర్మాణం మరింత పుంజుకుంటుందని భరత్ భూషణ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ కుమార్ విశ్వజీత్, పీసీసీఎఫ్ చలపతి రావు, సీఎఫ్‌ఎఫ్ ఎన్.ఎన్. రావులతో పాటు పలువురు విభాగాధిపతులు పాల్గొన్నారు.
ఈ ఫాస్ట్ ట్రాక్ విధానానికి సంబంధించిన పూర్తి వివరాలను అతి త్వరలోనే ప్రభుత్వం వెల్లడించనుంది. వివిధ శాఖల మధ్య సమన్వయం పెంచడం ద్వారా షూటింగ్‌ల అనుమతుల ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.








