ఏపీలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర సేవలను పొందేందుకు ప్రజలు ఇకపై తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సాధారణ ప్రభుత్వ సేవలకు ఆధార్ కార్డు, రేషన్ కార్డులను చిరునామా ధ్రువీకరణ పత్రాలుగా అంగీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ చేసే అధికారాన్ని ప్రభుత్వం తిరిగి తహసీల్దార్లకు అప్పగించింది. ఒకవేళ ఎవరికైనా ఈ సర్టిఫికెట్ తప్పనిసరిగా కావాల్సి వస్తే, తగిన ఆధారాలతో తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైతే తహసీల్దార్ స్థానికంగా విచారణ జరిపి, నివాసాన్ని నిర్ధారించుకున్నాక సర్టిఫికెట్ జారీ చేస్తారు.

అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం రెసిడెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా పీవీటీజీ (అత్యంత వెనుకబడిన ఆదివాసీ గిరిజన కుటుంబాలు) ఆధార్ నమోదు లేదా ఆధార్ అప్‌డేట్ కోసం తహసీల్దార్ జారీ చేసిన నివాస ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని ప్రభుత్వం సూచించింది.

ఐఐటీ, ఐఐఎమ్, సెంట్రల్ యూనివర్సిటీల వంటి కేంద్ర విద్యా సంస్థల్లో అడ్మిషన్ల సమయంలో చిరునామా ధ్రువీకరణ కోరితే ఈ సర్టిఫికెట్ అవసరమవుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ వంటి రక్షణ రంగ నియామకాల సమయంలో కూడా తహసీల్దార్ జారీ చేసిన సర్టిఫికెట్ తప్పనిసరి.

ఇప్పటికే తహసీల్దార్ ద్వారా రెసిడెన్స్ సర్టిఫికెట్ పొందిన వారు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. పాత సర్టిఫికెట్ చెల్లుబాటు అవుతుంది కాబట్టి, అవసరమైన సందర్భాల్లో దానినే వినియోగించుకోవచ్చు.