ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గడువును కేంద్ర ప్రభుత్వం మరో 15 రోజులు పెంచింది. జులై 31తో ముగిసిన ఈ గడువును ఇప్పుడు ఆగస్ట్ 15 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పంట నష్టం జరిగినప్పుడు రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది.

గతంలో జులై 31 వరకు గడువు ఉండటంతో గ్రామ, వార్డు సచివాలయాలు, కామన్ సర్వీస్ సెంటర్లు, డిజిటల్ సేవా కేంద్రాల వద్ద రైతులు పెద్ద ఎత్తున బారులు తీరారు. అయితే సర్వర్ సమస్యల వల్ల చాలా మంది దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయశాఖ కేంద్రంతో చర్చలు జరిపి గడువు పెంపునకు కృషి చేసింది.

ఈ పథకంలో చేరడం ద్వారా వరదలు, వర్షాలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు బీమా సొమ్ము అందుతుంది. రైతులు కొంత ప్రీమియం చెల్లిస్తే, మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన వారితో పాటు, రుణాలు తీసుకోని రైతులు కూడా ఈ పథకానికి అర్హులే.

మరోవైపు వాతావరణ ఆధారిత బీమా పథకం గడువు జులై 31తోనే ముగిసింది. కేవలం 7 పంటలకు మాత్రమే వర్తించే ఈ పథకం గడువును పెంచాలని కోరినప్పటికీ, బీమా సంస్థలు ఫసల్ బీమా యోజనకు మాత్రమే సానుకూలంగా స్పందించాయి. గడువు ముగిసేలోపు రైతులు త్వరగా ప్రీమియం చెల్లించి నమోదు చేసుకోవాలని వ్యవసాయశాఖ సూచించింది. ఆ తర్వాత ఎటువంటి అవకాశం ఉండదని స్పష్టం చేసింది.