న్యూఢిల్లీ: ఉమెన్స్ అంతర్జాతీయ టీ20 క్రీకెట్ లో భారత స్పిన్నర్ శ్రీ చరణి నెంబర్ వన్ బౌలర్ గా నిలిచింది. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న మహిళల టి20 ప్రపంచ కప్ 2026లో శ్రీ చరణి అద్భుతమైన ప్రదర్శనలతో రాణిస్తోంది. ఈ టోర్నమెంట్‌లో భారత్ తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ.. ఆడిన మూడు మ్యాచ్‌లలోనే 10 వికెట్లు పడగొట్టింది. దక్షిణాఫ్రికాతో జరిగిన గత మ్యాచ్‌లో శ్రీ చరణి 3/24 గణాంకాలు నమోదు చేసింది. దీంతో ఉమెన్స్ టి20 ర్యాంకింగ్స్‌లో లిన్సీ స్మిత్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
ఇంగ్లాండ్ తరపున ఆడిన మూడు మ్యాచ్‌లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే తీయడంతో స్మిత్ రెండు స్థానాలు దిగజారి మూడవ స్థానానికి పడిపోగా, చరణి రెండవ స్థానం నుండి అగ్రస్థానానికి ఎగబాకింది. ఆఫ్-స్పిన్నర్ చార్లీ డీన్ మూడవ స్థానం నుండి ఒక స్థానం పైకి ఎగబాకి రెండోస్థానంలో నిలిచింది.
కాగా, ఈ ప్రపంచ కప్‌లో 10 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా శ్రీచరణి అగ్రస్థానంలో కొనసాగుతోంది. అలాగే, ఒకే ప్రపంచ కప్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా పూనమ్ యాదవ్ (2020 ప్రపంచ కప్) పేరిట ఉన్న రికార్డును చరణి సమం చేసింది.








